Monday 16 April 2018

సూక్తి-1 - తవ కరకమలస్థాం (ప్రార్థన)


సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-1

తవ కరకమలస్థాం స్ఫాటికీమక్షమాలాం

నఖకిరణవిభిన్నాం దాడిమీబీజబుద్ధ్యా ।

ప్రతికలమనుకర్షన్ యేన కీరో నిషిద్ధః

స భవతు మమ భూత్యై వాణి తే మన్దహాస ॥1॥


తాత్పర్యం-
ఓ! వాణీ! నీ కరకమలంలో ఉన్న స్ఫటికజపమాల మీద ఎఱ్ఱని గోళ్ళ కిరణాలు పడడం చేత ఆ స్ఫటికపు పూసలను చూసి, దానిమ్మ గింజలని అనుకొని, నీ మరొక చేతిలో ఉన్న చిలుక మాటిమాటికీ లాగుతుండగా నీ ఏ చిరునవ్వు అది లాగకుండా చేసినదో ఆ చిరునవ్వు నాకు సర్వవిధాలా సమృద్ధిని ప్రసాదించుగాక. 


          గోళ్ళ కిరణాలు ప్రసరించి స్ఫటికపు పూసలు దానిమ్మ గింజల వలె అయినాయి. (తద్గుణాలంకారం). అలా చిలుక భ్రాంతి పడింది. (భ్రాంతిమదలంకారం). సరస్వతీదేవి చిరునవ్వు నవ్వగానే తెల్లని చిరునవ్వు ప్రసరించి మళ్ళీ స్ఫటికాలు స్ఫటికాలలాగే కనబడినాయి (అతద్గుణాలంకారము).

పదచ్చేదం :
తవ - కరకమల - స్పాటికీమ్ - అక్షమాలాం - నఖ - కిరణ విభిన్నాం - దాడిమీబీజ - బుద్ద్యా - ప్రతికలమ్ - అనుకర్షన్ - యేన - కీరః - నిషిద్దః - సః - భవతు - మమ భూతై - వాణి - తే - మన్దహాస.

No comments:

Post a Comment