Monday 9 July 2018

సూక్తి-72 - అప్రియముక్తాః పురుషాః

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-72
 
అప్రియముక్తాః పురుషాః ప్రయతస్తే ద్విగుణమప్రియం వక్తుమ్ ।
తస్మాదవాచ్యమప్రియమన్యప్రియవాక్యకామేన. 72.

తాత్పర్యము-
ఎవరి విషయంలోనైనా అప్రియవాక్యం పలికితే వాళ్లు రెట్టింపు అప్రియంగా ఉండే పరుషవాక్యం పలుకుతారు. అందుచేత ఇతరుల తనతో ప్రియవాక్యాలు పలకాలని కోరుకునేవాడు తానెప్పుడూ అప్రియం పలకకూడదు.

సూక్తి-71 - అసారే ఖలు సంసారే

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-71

అసారే ఖలు సంసారే సారం శ్వశురమన్దిరమ్ ।
క్షీరాబ్ధౌ చ హరిః శేతే శివః శేతే హిమాలయే ॥71॥
 

తాత్పర్యము-
సారవిహీనమైన ఈ సంసారంలో సారమైనది మామగారి ఇల్లే, అందుచేతనే విష్ణువు క్షీరసముద్రంలో (లక్ష్మి పుట్టిల్లు) శయనిస్తున్నాడు, శివుడు హిమాలయం మీద (హిమాలయంలో భాగమైన కైలాసం మీద)
శయనిస్తునాడు.

సూక్తి-70 - అన్యస్మిన్ ప్రేష్యమాణే

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-70

అన్యస్మిన్ ప్రేష్యమాణే తు పురస్తాద్యః సముత్పతేత్ ।
అహం కిం కరవాణీతి స రాజవసతిం వ్రజేత్ ॥70॥


తాత్పర్యము-
ప్రభువు ఎవరినైనా పనిమీద పంపుతున్నప్పుడు "ఏమి చెయ్యవలెను" అని అంటూ వానికంటే ముందు ఎవడు ఎగిరి లేస్తాడో ఆతడే రాజగృహానికి వెళ్లాలి.

సూక్తి-69 - అమ్లానో బలవాన్

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-69
 
అమ్లానో బలవాన్ శూరశ్ఛాయేవానుగతః సదా ।
సత్యవాదీ మృదుర్దాన్తః స రాజవసతిం వ్రజేత్ ॥69॥
 
తాత్పర్యము-
అలసిపోనివాడు, బలము కలవాడు, శూరుడు, ఎల్లప్పడు నీడ వలె దగ్గరనే ఉండేవాడు, సత్యం పలికేవాడు, మృదుస్వభావం కలవాడు, ఇంద్రియనిగ్రహం కలవాడు- ఇలాంటివాడే రాజగృహానికి వెళ్ళాలి (రాజసేవకోసం ప్రయత్నించాలి).

సూక్తి-68 - అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-68
అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ॥68॥
తాత్పర్యము-
అజ్ఞాని, నమ్మకం లేనివాడు, సంశయస్వభావుడు, వీళ్ళు నశిస్తారు. సంశయాత్మకు (అడుగడుగునా సంశయించేవానికి) ఇహలోకమూ లేదు, పరలోకమూ లేదు, సుఖం అసలే లేదు.

సూక్తి-67 - అన్యాయోపార్జితం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-67

అన్యాయోపార్జితం విత్తం దశ వర్షాణి తిష్ఠతి ।
ప్రాప్తే చైకాదశే వర్షే సమూలం చ వినశ్యతి ॥67॥

తాత్పర్యము-
అన్యాయంగా సంపాదించిన ధనం పది సంవత్సరాలు ఉంటుంది. పదకొండవ సంవత్సరం రాగానే అది సమూలంగా నశిస్తుంది.

సూక్తి-66 - అగ్రతశ్చతురో వేదాః

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-66

అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతః సశరం ధనుః ।
ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాదపి శరాదపి ॥66॥
 
తాత్పర్యము-
(ఇది పరశురాముణ్ణి గూర్చి చెప్పినది). 
ఎదుట (ముఖంలో) నాలుగు వేదాలు; వీపుమీద బాణాలతో కూడిన ధనస్సు, ఇదిగో నా దగ్గర బ్రాహ్మ తేజస్పూ ఉంది క్షాత్రపరాక్రమమూ ఉంది, శాపం చేతనైనా సాధిస్తాను, శరం చేతనైనా సాధిస్తాను.

సూక్తి-65 - అనర్ఘమపి మాణిక్యం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-65
 
అనర్ఘమపి మాణిక్యం హేమాశ్రయమషేక్షతే ।
వినాశ్రయం న శోభన్తే పణ్డితా వనితా లతాః ॥65॥
 
తాత్పర్యము-
ఎంత అమూల్యమైన మాణిక్యమైనా అది శోభించాలంటే దానికి బంగారం ఆశ్రయం ఉండాలి. అదే విధంగా పండితులు, స్త్రీలు, లతలు ఆశ్రయం లేకపోతే ప్రకాశించరు.

సూక్తి-64 - అశక్తస్తు భవేత్

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-64

అశక్తస్తు భవేత్ సాధుర్బ్రహ్మచారీ చ నిర్ధనః ।
వ్యాధితో దేవభక్తశ్చ వృద్ధా నారీ పతివ్రతా ॥64॥
 
తాత్పర్యము-
ఏమీ చేయలేనివాడు సాధువు (సత్పురుషుడు) అవుతాడు. ధనం లేనివాడు బ్రహ్మచారి అవుతాడు (గా ఉండిపోతాడు). రోగంతో బాధపడే వాడు దేవతాభక్తుడౌతాడు. వృద్ధ స్త్రీ పతివ్రత అవుతుంది. 64.

సూక్తి-63 - అన్యైః సాకం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-63
 
అన్యైః సాకం విరోధేన వయం పఞ్చోత్తరం శతమ్ ।
పరస్పరవిరోధేన వయం పఞ్చ చ తే శతమ్ ॥63॥
 
తాత్పర్యము-
(పాండవులు వనవాసం చేస్తున్నప్పడు వాళ్ళను అవమానించడం కోసం దుర్యోధనుడు సైన్యంతోను, మిత్రాది పరివారంతోను కలిసి వనానికి వచ్చినపుడు గంధర్వరాజు ఆతనిని యుద్దంలో ఓడించి తీసికొనిపోతూ ఉంటాడు. దుర్యోధనుణ్ణి విడిపించుకొని రండని యుదిష్ఠిరుడు తమ్ములను కోరగా వారు అంతగా సుముఖత్వం చూపించరు. అప్పుడు యుధిష్ఠిరుడు తమ్ముళ్ళతో అన్న మాటలు ఇవి.)

"ఇతరులతో విరోధం వచ్చినపుడు మనం నూట ఐదుగురం. మనలో మనకు విరోధం వచ్చినప్పడు మాత్రం మనం ఐదుగురం వాళ్ళు (ధార్తరాష్ట్రులు) నూరుగురు.

సూక్తి-62 - అపృచ్ఛం పుత్రదారాదీన్

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-62
 
అపృచ్ఛం పుత్రదారాదీంస్తైరుక్తోఽహం రఘూత్తమ ।
పాపం తవైవ తత్సర్వం వయం తు ఫలభాగినః. 62.
 
తాత్పర్యము-
(దారపుత్రాదులపోషణం కోసం అనేక పాపాలు చేస్తున్న వ్యాధుణ్ణి చూచి- "నీవిన్ని పాపాలు చేస్తున్నావు కదా, వీటని నీ దారపుత్రాదులు కూడా పంచుకొంటారా? వాళ్ళను అడుగుము." అని మునులు చెప్పి పంపుతారు. అతడు తిరిగి వచ్చి వాళ్ళు అన్న మాటలు చెపుతాడు) 

"రామా! నేను దారపత్రాదులను అడిగితే 'పాపం అంతా నీదే; నీవు చేసిన పాప కార్యాల ఫలితంగా లభించిన ధనాదులలోనే మేము భాగస్వాములం.” అని చెప్పినారు".

సూక్తి-61 - అన్యక్షేత్రే కృతం పాపం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-61
 
అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి ।
పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి ॥61॥
 
తాత్పర్యము-
ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో (పుణ్యక్షేత్ర యాత్ర చేస్తే) పోతుంది. పుణ్యక్షేత్రంలో చేసిన పాపం సిమెంటు పట్టులాగ పట్టుకొంటుంది.

సూక్తి-60 - అమన్త్రమక్షరం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-60

అమన్త్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధమ్ ।
అయోగ్యః పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః ॥60॥
 
తాత్పర్యము-
మంత్రంగా ఉపయోగించని అక్షరం లేదు. ఔషధం కాని చెట్టు వేరు లేదా మొక్క వేరు లేదు. దేనికో ఒకదానికి ఉపయోగించని మనిషి ఉండడు. ఇంకనే మంటే వీటిని జాగర్తగా సమకూర్చేవాడు చాలా అరుదుగా ఉంటూడు.

సూక్తి-59 - అభ్రవృన్దం విశాఖాన్తం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-59

అభ్రవృన్దం విశాఖాన్తం ప్రసూత్యన్తం చ యౌవనమ్ ।
రాజ్యాన్తం నరకం తద్వద్యాచనాన్తం హి గౌరవమ్ ॥59॥
 
తాత్పర్యము-
మేఘాలు విశాఖకార్తితో ఆఖరు. యౌవనం ప్రసవంతో ఆఖరు. రాజ్యానికి చివర నరకం (తప్పదు). ఏదైనా యాచించే వరకే ఎవరికైనా గౌరవం ఉండేది.

సూక్తి-58 - అతీవ బలహీనం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-58

అతీవ బలహీనం హి లఙ్ఘనం నైవ కారయేత్ ।
యే గుణా లఙ్ఘనే ప్రోక్రాస్తే గుణా లఘుభోజనే ॥58॥
 

తాత్పర్యము-
చాలా నీరసించి ఉన్నవాణ్ణి లంఘనం (లంఖణం) చేయించకూడదు. లంఘనంలో చెప్పిన గుణాలన్నీ లఘుభోజనంలో కూడా అందుచేత తేలికగా భోజనం చేయించాలి.

సూక్తి-57 - అధమా ధనమిచ్చన్తి

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-57
 
అధమా ధనమిచ్చన్తి ధనమానౌ చ మధ్యమాః ।
ఉత్తమా మానమిచ్చన్తి మానో హి మహతాం ధనమ్ ॥57॥
 
తాత్పర్యము-
అధములు ధనం కావాలని కోరుకుంటారు. మధ్యములు ధనమూ, మానమూ (గౌరవము) రెండూ కూడా కోరుకుంటారు. ఉత్తములు మానం మాత్రమే కోరుకుంటారు. ఎందుచేతనంటే మహాత్ములకు మానమే ధనం.

సూక్తి-56 - అనాహూతాః

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-56

అనాహూతాః స్వయం యాన్తి రసాస్వాదవిలోలుపాః ।
వివారితా న గచ్చత్తి మక్షికా ఇవ భిక్షుకాః ॥56॥
 

తాత్పర్యము-
ఆయా రసాలను (రుచులను) ఆస్వాదించాలనే ఆసక్తితో ఈగలవలె బిచ్చగాళ్ళు కూడా పిలవకుండానే వెడుతూ ఉంటారు, నివారించినా పోరు.

సూక్తి-55 - అస్మాకం బదరీచక్రం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-55
 

అస్మాకం బదరీచక్రం బదరీ చ తవాఙ్గణే ।
బాదరాయణసమ్బన్ధాద్ యూయం యూయం వయం వయమ్ ॥55॥
 

తాత్పర్యము-
మా బండి చక్రం బదరిదారువు (రేగికఱ్ఱ). మీ వాకిట్లో బదరి చెట్టు ఉన్నది. అందుచేత మన సంబంధం బాదరాయణ సంబంధం, మీరు మీరే, మేము మేమే.

సూక్తి-54 - అజాయుద్ధమ్

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-54

అజాయుద్ధమృషిశ్రాద్ధం ప్రభాతే మేఘడమ్బరమ్ ।
దమ్పత్యోః కలహశ్చైవ పరిణామే న కించన ॥54॥
 

తాత్పర్యము-
మేకలయుద్ధం, ఋషుల శ్రాద్ధం, ప్రాతఃకాలంలో ఉన్న మేఘాడంబరం, దంపతుల కలహం- వీటిలో చివరికి ఏమీ ఉండదు.

సూక్తి-53 - అమా పూర్ణా

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-53
 

అమా పూర్ణా గురుం హన్తి శిష్యం హన్తి చతుర్దశీ ।
ఉభయోరష్టమీ హన్తి ప్రతిపత్ పాఠనాశినీ ॥53॥
 

తాత్పర్యము-
(అమావాస్యాది తిథులలో వేదాధ్యయనం చెయ్యకూడదు) అమావాస్య, పూర్ణిమ గురువును చంపుతాయి. చతుర్దశి శిష్యుణ్ణి చంపుతుంది. అష్టమి ఇద్దరినీ చంపుతుంది. పాడ్యమి పాఠాన్ని నశింప చేస్తుంది.

సూక్తి-52 - అలంకారప్రియో

సంస్కృతసూక్తిరత్నకోశః ప్రథమా మంజూషా-52
అలంకారప్రియో విష్ణుర్జలధారాప్రియః శివః ।
నమస్కారప్రియో భానుర్బ్రాహ్మణో భోజనప్రియః ॥52॥

తాత్పర్యము-
విష్ణువుకు అలంకారాలంటే ఇష్టం; శివునికి జలధార ఇష్టం. సూర్యునికి నమస్కారం ఇష్టం; బ్రాహ్మణునికి భోజనం ఇష్టం.