Monday 9 July 2018

సూక్తి-72 - అప్రియముక్తాః పురుషాః

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-72
 
అప్రియముక్తాః పురుషాః ప్రయతస్తే ద్విగుణమప్రియం వక్తుమ్ ।
తస్మాదవాచ్యమప్రియమన్యప్రియవాక్యకామేన. 72.

తాత్పర్యము-
ఎవరి విషయంలోనైనా అప్రియవాక్యం పలికితే వాళ్లు రెట్టింపు అప్రియంగా ఉండే పరుషవాక్యం పలుకుతారు. అందుచేత ఇతరుల తనతో ప్రియవాక్యాలు పలకాలని కోరుకునేవాడు తానెప్పుడూ అప్రియం పలకకూడదు.

సూక్తి-71 - అసారే ఖలు సంసారే

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-71

అసారే ఖలు సంసారే సారం శ్వశురమన్దిరమ్ ।
క్షీరాబ్ధౌ చ హరిః శేతే శివః శేతే హిమాలయే ॥71॥
 

తాత్పర్యము-
సారవిహీనమైన ఈ సంసారంలో సారమైనది మామగారి ఇల్లే, అందుచేతనే విష్ణువు క్షీరసముద్రంలో (లక్ష్మి పుట్టిల్లు) శయనిస్తున్నాడు, శివుడు హిమాలయం మీద (హిమాలయంలో భాగమైన కైలాసం మీద)
శయనిస్తునాడు.

సూక్తి-70 - అన్యస్మిన్ ప్రేష్యమాణే

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-70

అన్యస్మిన్ ప్రేష్యమాణే తు పురస్తాద్యః సముత్పతేత్ ।
అహం కిం కరవాణీతి స రాజవసతిం వ్రజేత్ ॥70॥


తాత్పర్యము-
ప్రభువు ఎవరినైనా పనిమీద పంపుతున్నప్పుడు "ఏమి చెయ్యవలెను" అని అంటూ వానికంటే ముందు ఎవడు ఎగిరి లేస్తాడో ఆతడే రాజగృహానికి వెళ్లాలి.

సూక్తి-69 - అమ్లానో బలవాన్

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-69
 
అమ్లానో బలవాన్ శూరశ్ఛాయేవానుగతః సదా ।
సత్యవాదీ మృదుర్దాన్తః స రాజవసతిం వ్రజేత్ ॥69॥
 
తాత్పర్యము-
అలసిపోనివాడు, బలము కలవాడు, శూరుడు, ఎల్లప్పడు నీడ వలె దగ్గరనే ఉండేవాడు, సత్యం పలికేవాడు, మృదుస్వభావం కలవాడు, ఇంద్రియనిగ్రహం కలవాడు- ఇలాంటివాడే రాజగృహానికి వెళ్ళాలి (రాజసేవకోసం ప్రయత్నించాలి).

సూక్తి-68 - అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-68
అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ॥68॥
తాత్పర్యము-
అజ్ఞాని, నమ్మకం లేనివాడు, సంశయస్వభావుడు, వీళ్ళు నశిస్తారు. సంశయాత్మకు (అడుగడుగునా సంశయించేవానికి) ఇహలోకమూ లేదు, పరలోకమూ లేదు, సుఖం అసలే లేదు.

సూక్తి-67 - అన్యాయోపార్జితం

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-67

అన్యాయోపార్జితం విత్తం దశ వర్షాణి తిష్ఠతి ।
ప్రాప్తే చైకాదశే వర్షే సమూలం చ వినశ్యతి ॥67॥

తాత్పర్యము-
అన్యాయంగా సంపాదించిన ధనం పది సంవత్సరాలు ఉంటుంది. పదకొండవ సంవత్సరం రాగానే అది సమూలంగా నశిస్తుంది.

సూక్తి-66 - అగ్రతశ్చతురో వేదాః

సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-66

అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతః సశరం ధనుః ।
ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం శాపాదపి శరాదపి ॥66॥
 
తాత్పర్యము-
(ఇది పరశురాముణ్ణి గూర్చి చెప్పినది). 
ఎదుట (ముఖంలో) నాలుగు వేదాలు; వీపుమీద బాణాలతో కూడిన ధనస్సు, ఇదిగో నా దగ్గర బ్రాహ్మ తేజస్పూ ఉంది క్షాత్రపరాక్రమమూ ఉంది, శాపం చేతనైనా సాధిస్తాను, శరం చేతనైనా సాధిస్తాను.